త్వరలో ఏపీలో లీగల్ ఏఐ స్టాక్ అమలు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ అదాలత్ లాంటి వ్యవస్థల వల్ల, సాంకేతికత వల్ల న్యాయాన్ని మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు సంక్షోభంలో ఉన్నా భారత్ మాత్రం స్థిరంగా ఉందని, దీనికి ప్రధాన కారణం బలమైన ప్రజాస్వామ్యం ఇక్కడ ఉండడమేనని అన్నారు సీఎం. ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన నాలుగు స్తంభాలు పటిష్టంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం అని పేర్కొన్నారు. 2047 నాటికి దేశం వికసిత్ భారత్‌గా, ఏపీ స్వర్ణాంధ్రగా మారుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు. పౌర పాలనలో కూడా ఏఐ లాంటి సాంకేతికత ద్వారా మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. పన్ను వసూళ్లలో ఏఐ లాంటి వ్యవస్థలతో మెరుగైన ఫలితాలను కూడా రాబడుతున్నాం అన్నారు.
లీగల్ గవర్నెన్సు, లిటిగేషన్ మేనేజ్మెంట్ కోసం లీగల్ ఏఐ స్టాక్ ను కూడా త్వరలోనే అమలు చేయాలని నిర్ణయించాం అని ప్రకటించారు సీఎం. ఆన్ లైన్ లిటిగేషన్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా 8.4 లక్షల కేసుల నిర్వహణ చేస్తున్నాం అన్నారు. లీగల్ ఏఐ స్టాక్ ద్వారా యూనిఫైడ్ డిజిటల్ లా డిపాజిటరీ, రూల్స్, జీఓలు, కేస్ రికార్డులను, ఏఐ కేస్ అనాలసిస్, కౌంటర్ అఫిడవిట్స్ లాంటి తయారు చేసేలా చూస్తున్నాం అన్నారు . ఆర్బిట్రేషన్, మీడియేషన్ లాంటి విధానాలను కూడా త్వరితగతిన కేసులు పరిష్కరించేందుకు వినియోగిస్తున్నాం అని వెల్లడించారు. ప్రస్తుతం వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల్లో ప్రభుత్వం కూడా ఓ ప్రతివాదిగా ఉంటోందన్నారు. కోర్టుల సహకారంతో ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ప్రయోజనం కల్పించాలన్నది మా ఆలోచన అని పేర్కొన్నారు. రాజ్యాంగం పేర్కొన్న విలువలను కాపాడుతూ, సమయానికి ప్రజలకు న్యాయం చేకూర్చేలా మనం అంతా కలిసి పనిచేయాల్సి ఉందన్నారు.