పోలవరం పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల గురించి పట్టించు కోలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ , అత్యంత కీలకమైన వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్ట్ సివిల్ పనులు 89.9 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు ఈ సందర్బంగా ముఖ్యమంత్రికి జల వనరుల శాఖ ఉన్నతాధికారులు. అలాగే పోలవరం ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు.
ఇదిలా ఉండగా ECRF డ్యామ్ గ్యాప్-1 , గ్యాప్-2 పనులు వేగంగా సాగుతున్నాయా లేదా అని ఆరా తీశారు నారా చంద్రబాబు నాయుడు. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాల్సిన 36 ప్రాజెక్టులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లలో నీటి నిల్వ, నీటి విడుదల , ఇతర సంబంధిత అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం , వెలిగొండ ప్రాజెక్టుల పనులు ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు. సాద్యమైనంత త్వరగా పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.