ఘనంగా స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్, ఈవో
తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో విబి జీ – రాం జీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నేరుగా తిరుమల వెళ్లి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్ కి ఆశీర్వచనం చేశారు. స్వామి వారి చిత్ర పటంతోపాటు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం శ్రీవారిని దర్శించు కోవాలని తలంచారు. ఇందులో భాగంగా సాయంత్రం దర్శనానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ తో పాటు తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
ఇదిలా ఉండగా శ్రీవారిని దర్శించుకున్న అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కోవడం ఆనందంగా ఉందన్నారు. కోట్లాది మంది భక్తులను కలిగిన ఆ కలియుగ దైవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.















