శ్రీవారి పాదాల చెంత వేడుకగా ఛత్ర స్థాపనోత్సవం

తిరుమల : తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్ర స్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టిటిడి అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండో గంట తర్వాత పూజ సామ‌గ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళ వాయిద్యాల నడుమ ఆల‌య మాడ వీధుల గుండా మేదరమిట్టకు చేరుకున్నారు. అక్క‌డి నుండి నారాయ‌ణ‌గిరికి విచ్చేశారు. ముందుగా శ్రీ‌వారి పాదాల‌కు తిరుమంజ‌నం చేప‌ట్టారు. అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేద పారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. ఆ త‌రువాత‌ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అధికారులు, అర్చకులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    ​ఇంద్రకీలాద్రిపై శాకంబరీ మహోత్సవాలు

    విజ‌య‌వాడ : ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న‌ జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే శాకంబ‌రీ ఉత్స‌వాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్స‌వాలు ఈనెల 29వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయి. దేవస్థాన యంత్రాంగం భారీ…

    విద్యార్థుల్లో ధర్మ, సంస్కార విలువల పెంపు

    తిరుపతి : హెచ్ డి పిపి, శ్రీ కాంచీ కామకోటి పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 100 పాఠశాలల్లో విజయవంతమైన “ప్రజల వద్దకు ధర్మం” అనే దివ్య సంకల్పంతో విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, నైతిక విలువలు, సాంప్రదాయ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *