తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. కొందరు పనిగట్టుకుని టీటీడీ నిర్వహణపై దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల హాస్టల్ లో శాంభవి బ్లాక్ , ప్రణతి బ్లాక్ లలో మరుగుదొడ్లు, స్నానపు గదులు వినియోగించ లేని స్థితిలో ఉన్నాయని సోషియల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నట్లు పెద్ద ఎత్తున ఫోటోలు, ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ అసత్య ప్రచారాన్ని టీటీడీ పూర్తిగా ఖండిస్తోందని పేర్కొంది.
వాస్తవానికి శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలలో అభివృద్ధి పనుల్లో భాగంగా స్నానపు గదులను, మరుగుదొడ్లను నిర్మించడం జరుగుతోందని స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు దురుద్దేశ పూర్వకంగా నిర్మాణంలో ఉన్న స్నానపు గదులు, మరుగుదొడ్లను ఫోటోలు తీసి అసత్య ప్రచారం చేయడం శోచనీయం అని ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థుల కోసం టీటీడీ విద్యా సంస్థల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు టీటీడీ నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేసింది . ఇలా దుష్ప్రచారానికి ఒడిగట్టిన వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది. సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మకూడదని ఈ సందర్భంగా టీటీడీ కోరింది.






