గుడిలో బర్త్ డే వేడుకలపై టీటీడీ సీరియస్
తిరుపతి : తిరుపతి జిల్లాలోని నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న వారిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చల్లుకుంటూ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడమే కాకుండా ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేధం ఉన్నప్పటికీ తమ సెల్ ఫోన్ తో ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెల్సన్ మండేలా అనే వ్యక్తితో పాటు మరో నలుగురిపై టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసు కేసు నమోదు చేయడం జరిగింది.
సదరు ఘటనా సమయంలో అప్రమత్తంగా లేకుండా ఉన్న టీటీడీ సిబ్బందిపై శాఖాపరమైన చర్యల కై ఆదేశించడం జరిగిందని తెలిపింది తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ). ఆదివారం ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి చర్యలను టీటీడీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని స్పష్టం చేసింది. ఇలాంటి వారిపై టీటీడీ చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది. ఎవరైనా సరే టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రయత్నం చేసినా లేదా పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేస్తామని పేర్కొంది.