రవాణా శాఖ మంత్రిని కలిసిన ఆర్టీసీ ఎండీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, వైఎస్ చైర్మన్ గా తాజాగా బాధ్యతలు చేపట్టారు సీనియర్ పోలీస్ అధికారి అనిల్ కుమార్. ఈ సందర్బంగా గురువారం మర్యాద పూర్వకంగా రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి – ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు తీరు, మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సుల నిర్వహణపై సమీక్షించారు. అలాగే హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంపు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నూతన బస్సుల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయడం, ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో పెంపు, సంస్థ ఆర్థిక బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎండీ, వైస్ చైర్మన్ కు పలు కీలక సూచనలు చేశారు పొన్నం ప్రబాకర్ గౌడ్.
ఇదిలా ఉండగా ప్రయాణికులకు మరింత మెరుగైన, సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించు కోవాలని సూచించారు. నూతన బాధ్యతలు చేపట్టిన డాక్టర్ అనిల్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియ చేశారు. టీజీఎస్ ఆర్టీసీని దేశంలోనే ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. దేశంలో కర్ణాటక రాష్ట్రంతో పాటు తెలంగాణలో మహిళలకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. సంస్థను మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టాలన్నారు.