newsseals.com

తెలంగాణ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను స‌క్సెస్ చేయాలి

November 23, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 దాదాపు 80 వేల చ.మీ. విస్తీర్ణంలో అతిపెద్ద బహుళ రంగాల ఎక్స్ పోగా నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సమ్మిట్ కోసం ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. ఫ్యూచ‌ర్ సిటీ లోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న సమ్మిట్ ఏర్పాట్ల పురోగతిని అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సమ్మిట్ వేదిక, వివిధ హాల్స్, అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.

సమ్మిట్‌లో భాగంగా ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్‌పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పో, క్లైమేట్ కాన్ క్లేవ్ నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమ్మిట్ కోసం వివిధ రంగాల నుంచి దాదాపు వెయ్యికి పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్న నేపథ్యంలో వారికి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతినిధులు సులభంగా ప్రవేశించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడాలని సూచించారు.

పెట్టుబడులు, పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తూ సమ్మిట్ నిర్వహిస్తున్నందున, ఆహ్వానాలు పంపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతినిధులతో అత్యంత మర్యాదగా వ్యవహరించేలా విధుల్లో ఉన్న అధికారులకు శిక్షణ ఇవ్వాలన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కాకతీయుల శిల్పకళ, సమ్మక్క సారలమ్మ ఆలయంలో ఉన్న తోరణాల నమూనాలు, సోమశిల ఆలయం, నిర్మల్ పెయింటింగ్స్, రాష్ట్రానికి చెందిన భౌగోళిక సూచిక (GI) గుర్తింపు ఉన్న ఉత్పత్తులు, చేనేత, రాష్ట్ర అభివృద్ధి, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర భవిష్యత్ ప్రణాళికలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా సమ్మిట్‌కు ఆహ్వానించాలని సూచించారు.

Related News