హైదరాబాద్ : ఎల్ నినో ప్రభావం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో నీటి కొరతకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గాంధీ భవన్‌లో జరిగిన పీఏసీ (PAC) సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. అత్యంత కీలకమైన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణలో సమగ్ర కుల గణన నిర్వహించిన తమ ప్రభుత్వ స్ఫూర్తితో 2027 జనగణనలో ఓబీసీ (OBC) కుల గణనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయాలని చర్చించామని తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాబోయే ఎల్-నినో (El Niño) పరిస్థితుల వల్ల వ్యవసాయం , నీటి భద్రతకు ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు మంత్రి.
రాబోయే ఎనిమిది నెలల పాటు నిరంతరాయంగా తాగునీటిని అందించేందుకు తమ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 30,000 కోట్ల ఆర్థిక సహాయాన్ని కోరుతున్నామని చెప్పారు. అలాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడు కూడా తన ప్రాథమిక ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం, ప్రతి ఇంటికి తాగునీరు అందించడం, ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కులను కాపాడటమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతలు అని స్పష్టం చేశారు.




