newsseals.com

ఎస్‌టీపీల నిర్వ‌హ‌ణ స‌రిగా ఉండాలి : క‌మిష‌న‌ర్

November 26, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎస్‌టీపీల నిర్వ‌హ‌ణ‌లో అల‌స‌త్వం ఉండ‌రాద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ అన్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం వాటిని ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా.. నిర్వ‌హ‌ణ కూడా స‌రిగా ఉండేలా చూడాల‌న్నారు. ఎస్‌టీపీల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను ప్రైవేటు ఏజెన్సీల‌కు అప్ప‌గించేశాం.. మ‌న ప‌ని అయిపోయింద‌నేట్టు గేటెడ్ క‌మ్యూనిటీలు భావించ‌రాద‌ని పేర్కొన్నారు. ఈ బాధ్య‌త‌లు తీసుకున్న ఏజెన్సీలు కూడా నిర్వ‌హ‌ణ‌కు అనువైన వాతావ‌ర‌ణం ఉందా లేదా.. ఎంత వ‌ర‌కూ మురుగు నీరు శుభ్రం అవుతోంది.. నాణ్య‌తా ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఆ నీరు ఉందా లేదా అనేది కూడా చూడాల్సిన బాధ్య‌త ఉంద‌న్నారు. ఇవేవీ ప‌ట్ట‌న‌ట్టు ఎస్‌టీపీల‌ను నిర్వ‌హిస్తే బాధ్యుల‌పైన చ‌ర్య‌లుంటాయ‌ని క‌మిష‌న‌ర్ హెచ్చ‌రించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్‌, ఏపీఆర్ ఎన్‌క్లేవ్‌లో ఎస్‌టీపీ ట్యాంక్ శుభ్రం చేస్తూ విషవాయువులు పీల్చి ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘ‌ట‌నా స్థ‌లాన్ని పరిశీలించి ప్ర‌మాదానికి సంబంధించిన వివరాలను హైడ్రా, సీఎంసీ అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా ఎస్‌టీపీ ట్యాంకులోకి దిగి ముగ్గురు మృతి చెంద‌డం అత్యంత బాధాకరమని అన్నారు.అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌టీపీల నిర్వాహ‌కుల‌తో త్వ‌ర‌లో స‌మావేశాన్ని ఏర్పాటు చేసి నియ‌మ నిబంధ‌న‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే కాకుండా.. వారికి దిశానిర్దేశం చేస్తామ‌న్నారు. ఎస్‌టీపీల నిర్వ‌హ‌ణ‌లో లోపాల‌ను నియంత్రించ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.
ఎస్టీపీల నిర్మాణంలో విష వాయువులు పేరుకు పోకుండా సరైన వెంటిలేషన్, గ్యాస్ బయటకు వెళ్లే ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ట్యాంకుల్లో విష వాయువులు పేరుకు పోయినప్పుడు ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా లోపలికి దిగడం ప్రాణాంత‌కం అవుతుంద‌న్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో సెప్టిక్ ట్యాంక్, ఎస్టీపీ నిర్మాణం, వెంటిలేషన్ వ్యవస్థ, నిర్వహణ భద్రతా ప్రమాణాలపై పరిశీలన అవసరమని సూచించారు.

Related News