హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్దరణ కార్యక్రమం సత్ ఫలితాలను ఇస్తోంది. ప్రధానంగా సీఎం ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో చెరువులను ఆక్రమణల నుంచి రక్షించడం ప్రారంభించారు. భారీ ఖర్చుతో కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఎల్ నినో ప్రభావానికి గురైంది. ఎక్కడ చూసినా కాంక్రీట్ భవనాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఉన్నట్టుండి వర్షం రావడంత నగర వాసులు కొంత ఇబ్బంది పడ్డారు. డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభానికి సిద్ధమైన సున్నం చెరువుకు వర్షం నీరు చేరింది. శుక్రవారం తెల్లవారు జామున కురిసిన వర్షంతో సున్నం చెరువు జలకళ ను సంతరించుకుంది.
ఏమాత్రం వర్షం పడినా వరద నీరు చెరువులోకి చేరేలా ఇన్లెట్లు అభివృద్ధి చేయడంతో పరిసరాల్లో పడిన వర్షం నీరు నేరుగా సున్నం చెరువుకు చేరింది. డిసెంబర్ 2 లేదా 3వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈ చెరువును ప్రారంభించనున్న తరుణంలో వర్షం కురవడం ఆ నీరు చెరువులోకి చేరడం శుభ పరిణామంగా స్థానికులు భావిస్తున్నారు. ఆక్రమణలకు గురై.. మురికి కూపంగా ఉన్న చెరువును హైడ్రా అభివృద్ధి చేసింది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేనప్పటికీ.. శుక్రవారం కురిసిన వర్షం ఎంతో ఊరటనిచింది అని స్థానికులు తెలిపారు. సున్నం చెరువులోకి వర్షం నీరు చేరడంతో ఫొటోలు, వీడియోలు హైడ్రాకు పంపి ఆనందాన్ని వ్యక్తం చేసారు. 14 ఎకరాలకు కుంచించుకు పోయిన ఈ చెరువును 32 ఎకరాలకు హైడ్రా విస్తరించిన విషయం విదితమే.




